వరలక్ష్మీ వ్రతకథా ప్రారంభము

0
Spread the love

సూతపౌరాణికుండు శౌనకుడు మొదలగు మహర్షులంజూచి యిట్లనియె! ముని వర్యులారా!

స్త్రీలకు సకల సౌభాగ్యంబులు గలుగునట్టి ఒక వ్రతరాజంబును పరమేశ్వ రుండు పార్వతీదేవికిం జెప్పె. దానిం జెప్పెద వినుండు.

ఒకప్పుడు కైలాసపర్వతమున వజ్ర విద్రుమ వైడూర్యాది మణి గణఖచితంబగు సింహాసనమునందు పరమేశ్వరుండు కూర్చుండి యుండ పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి

‘దేవా! లోకమున స్త్రీలు ఏవ్రతం బొనర్చిన సర్వసౌభాగ్యంబును, పుత్రపౌత్రాదులం గలిగి సుఖంబుగ నుందురో అట్టి వ్రతంబు నా కానతీయవలయు’ ననిన నప్పరమేశ్వరుం డిట్లనియె!

“ఓ మనోహరీ! స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తుల గలుగం జేసెడి వరలక్ష్మీ వ్రతంబను ఒక వ్రతంబు గలదు.

ఆ వ్రతంబును శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగ వచ్చెడి శుక్రవారమునాడు చేయవలయుననిన పార్వతీదేవి యిట్లనియె


“ఓ లోకారాధ్యా! నీ వానతిచ్చిన వరలక్ష్మీ వ్రతంబును ఎట్లు సేయవలయును? ఆ.వ్రతమునకు విధియేమి? ఏ

దేవతను పూజింపవలయును? పూర్వం బెవరిచే ఈ వ్రతం బాచరింపబడినది? వీని నెల్ల వివరంబుగా

వచింపవలయు” నని ప్రార్థింప పరమేశ్వరుండు పార్వతీ దేవింగాంచి యిట్లనియె –

“ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రతంబు సవిస్తారంబుగ జెప్పెద వినుము. మగధ దేశంబున కుండినంబను నొక

పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబుల తోడను, బంగారు గోడలుగల ఇండ్లతోడను గూడి

యుండును. అట్టి పట్టణమునందు చారుమతియను నొక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆ వనితామణి పెనిమిటిని

దేవునితో సమానముగా దలంచి ప్రతి దినమును ఉదయంబున మేల్కాంచి స్నానంబుచేసి పుష్పం బులచే

పెనిమిటిని పూజచేసిన పిదప అత్తమామలకు అనేక విధంబులైన యుపచారం బులం జేసి ఇంటిపనులం

జేసికొని, గయ్యాళిగాక మితముగాను, ప్రియముగాను భాషించుచు నుండెను.

ఇట్లుండ ఆ మహాపతివ్రతయందు మహాలక్ష్మికి అనుగ్రహంబు గలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నయై

“ఓ చారుమతీ! నేను వరలక్ష్మీదేవిని, నీయందు నాకు అనుగ్రహము గలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణశుక్ల

పూర్ణిమకు ముందుగా వచ్చెడి శుక్రవారము నాడు నన్ను సేవించినచో నీకు కోరిన వరముల నిచ్చెద”నని

వచించిన, చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి –

శ్లో॥ నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే, శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే ॥

అని యనేక విధంబుల స్తోత్రముచేసి “ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు గలిగెనేని జనులు ధన్యులుగను,

విద్వాంసులుగను, సకల సంపన్నులుగను నయ్యెదరు. నేను నాజన్మాంతరమున చేసిన పుణ్య

విశేషంబువలన మీ పాదదర్శనంబు నాకు గలిగెనని నమస్కరించెను.

మహాలక్ష్మి సంతోషంబు జెంది చారుమతికి అనేక వరంబులిచ్చి అంతర్ధానంబు నొందెను.

చారుమతి తక్షణంబున నిదుర మేల్కొని ఇంటికి నాల్గు ప్రక్కలం జూచి వరలక్ష్మీ దేవిని గానక

“ఓహో! మనము కలగంటి” మని, ఆ స్వప్నవృత్తాంతమును పెనిమిటి – మామాగారు మొదలైనవారితో జెప్ప, వారు “ఈ స్వప్నము మిగుల నుత్తమమైనది.

శ్రావణ మాసము వచ్చినతోడనే వరలక్ష్మీ వ్రతం బవశ్యముగ చేయవలసిన”దని చెప్పిరి.

పిమ్మట చారుమతీ దేవియును, స్వప్నంబును విన్న స్త్రీలును శ్రావణమాసము ఎప్పుడు వచ్చునాయని

యెదురు చూచుచుండిరి. ఇట్లుండ వీరి భాగ్యోదయంబు వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందుగ వచ్చెడి

శుక్రవారము వచ్చెను. అంత చారుమతి మొదలగు స్త్రీలందరును ‘ఈ దినంబేగదా వరలక్ష్మీదేవి చెప్పిన

దినం’బని ఉదయంబుననే మేల్కాంచి స్నానముచేసి చిత్రవస్త్రంబులం గట్టుకొని చారుమతీదేవి గృహంబున

నొక ప్రదేశమునందు గోమయంబుచే నలికి మంటపం బేర్పఱచి యందొక ఆసనంబు వైచి దానిపై

బియ్యముపోసి కలశం బేర్పరచి యందు వరలక్ష్మీ దేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరు మిగుల భక్తియుక్తులై సాయంకాలమున –

శ్లో॥ పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవ సర్వదా ॥

అను శ్లోకముచే ధ్యా నావాహనాది షోడశోపచార పూజలంచేసి తొమ్మిది సూత్ర ములుగల తోరములను దక్షిణ హస్తముల గట్టుకొని వరలక్ష్మీ దేవికి నానావిధ భక్ష్యభో జ్యంబులును నివేదనముచేసి, ప్రదక్షిణము చేసిరి.

Varalakshmi Vratam photo

ఇట్లొక ప్రదక్షిణము చేయగా నా స్త్రీలకందరికి కాళ్లయందు ఘల్లుఘల్లుమను నొక శబ్దము కలిగెను.

అంత కాళ్లం జూచుకొనిన గజ్జెలు మొదలగు నాభరణములు గలిగియుండ చారుమతి మొదలగు

స్త్రీలందరును ‘ఓహో! ఇవి వరలక్ష్మీదేవి కటాక్షము వలన గలిగినవి’ అని పరమానందము నొంది మఱియొక

ప్రదక్షిణము చేసిన హస్తములందు ధగద్ధగాయమానముగ మెరయుచుండు నవరత్న ఖచితములయిన

కంకణములు మొదలగు నాభరణము లుండుటం గనిరి. ఇంక జెప్పనేల!

మూడవ ప్రదక్షిణము గావించినతోడనే ఆ స్త్రీలందరు సర్వభూషణ అలంకార భూషితలయిరి. చారుమతి మొదలగు ఆ

స్త్రీల గృహములనెల్ల స్వర్ణమయములయి రథగజతురగ వాహనములతోడ నిండియుండెను.

అంత నా స్త్రీలం దోడ్కొని గృహములకు పోవుటకు వారివారి యిండ్లనుండి గుఱ్ఱములు, ఏనుగులు, రథములు, బండ్లును వరలక్ష్మీ దేవిని పూజించుచుండెడి స్థలమునకు వచ్చి నిలిచియుండెను.

పిదప చారుమతి మొదలగు స్త్రీలందరును తమకు కల్పోక్త ప్రకారముగ పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని

గంధపుష్పాక్షతలచే పూజించి పండ్రెండు కుడుములు, పాయస దానంబిచ్చి దక్షిణ తాంబూలముల నొసంగి

నమస్కారము చేసి యీ బ్రాహ్మ ణోత్తమునిచే నాశీర్వాదంబునొంది వరలక్ష్మీదేవికి నివేదనము చేసిన

భక్ష్యాదులను బంధువులతోడ ఎల్లరును భుజించి, తమకొరకు వచ్చి కాచుకొనియున్న గుఱ్ఱములు, ఏనుగులు

మొదలగు వాహనముల నెక్కి తమ తమ ఇండ్లకుం పోయిరి. అపుడు వారు ఒకరితో నొకరు ‘ఆహా!

చారుమతీదేవి భాగ్యం బేమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి ” తనంతట తానే స్వప్నములో వచ్చి

ప్రత్యక్షంబాయెను. ఆ చారుమతీదేవి వలననేగదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు గలిగె’నని చారుమతీ దేవిని మిక్కిలి పొగడుచు తమ తమ ఇండ్లకు పోయి చేరిరి.

నాటినుండియు చారుమతి మొదలగు స్త్రీలందరును ప్రతి సంవత్సరము ఈ వ్రతంబు చేయుచు పుత్రపౌత్రాభివృద్ధి గలిగి ధనకనక వస్తు వాహనముల తోడం గూడుకొని సుఖంబుగ నుండిరి.

కావున ఓ పార్వతీ! యీ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతులవారును చేయవచ్చును.

అటు లొనర్చిన సర్వ సౌభాగ్యములు గలిగి సుఖంఉగ నుందురు. ఈ కథను వినువారలకు, చదువువారలకు వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యంబులు సిద్ధించును.

ఇది భవిష్యోత్తర పురాణమునందు పార్వతీ పరమేశ్వర సంవాదమైన వరలక్ష్మీ వ్రతకల్ప కథా సంపూర్ణము.

https://www.leelasoft.com/

Read this: https://www.bpknews.in/home-loans-in-vijayawada/

https://www.bpknews.in/varalakshmi-vratam-in-2023/

https://www.bpknews.in/varalakshmi-vratam-athanga-pooja/

https://www.bpknews.in/srilakshmi-ashtottara-shatanamavali/

https://www.bpknews.in/varalakshmi-vrata-pooja/

https://www.bpknews.in/beginning-of-varalakshmi-vratakatha/


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *