ఆధార్ జాబ్ కార్డుకు అనుసంధానం
ఉపాధి హామీ పథకం పనులు చేసే కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్యాంకుల్లో డబ్బులు జమ చేసేందుకు జాబ్ కార్డులకు ఆధార్ అనుసంధానం చేయనున్న కేంద్ర ప్రభుత్వం.
ఫిబ్రవరి 1వ తేదీ నుండి కేంద్ర ఉపాధి హామీ కూలీ డబ్బులను ఆధార్ లింక్ అయిన బ్యాంకు ఖాతాలల్లో గానీ, పోస్టాఫీస్ ఖాతాల్లో గానీ జమ చేయనున్నది.
దీంతో కూలీలకు ఎప్పటికప్పుడు త్వరగా చెల్లింపులు జరుగుతాయి.
జిల్లాలో చాలా మంది కూలీల ఖాతాలు సక్రమంగా లేక, ఖాతాల కొనసాగింపు లేక కూలీ డబ్బులు రాక ఇబ్బందులకు గురి అవుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కూలీలకు ఇబ్బందులు తప్పనున్నాయి.
జిల్లాలో 1,29,904 జాబ్ కార్డులను జారీ చేయగా, 92 శాతానికి పైగా జాబ్ కార్డులు కలిగిన కూలీల ఆధార్ నంబర్లను సేకరించి జాబ్ కార్డులను లింక్ చేశారు.
గ్రామాల్లో వలసలను నివారించేందుకు, వ్యవసాయ పనులు లేని సమయంలో కూలీలకు పనులు కల్పించేందుకు 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుక వచ్చింది.
ఈ పథకానికి చట్టబద్ధత కల్పించి ప్రతి కుటుంబానికి ఏడాదికి 100 పని దినాలు కల్పించాలనే ప్రాతిపదిక తెచ్చింది.
జాబ్ కార్డులు పొందిన వారందరికి పనులు కల్పించేందుకు ప్రతి ఏటా డ్వామా సిబ్బంది గ్రామసభలు నిర్వహించి పనులను కేటాయిస్తారు.
ఆ పనులకు ప్రభుత్వం ఆమోదం లభించిన తర్వాత క్రమంగా చేసుకుంటూ పోతుంటారు.
దేశంలో తెలంగాణ సహా రెండు, మూడు రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాల్లో ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్ ద్వారానే ఉపాధి హామీ పనులు జరిపిస్తున్నారు.
నాలుగు మాసాల నుంచి దేశవ్యాప్తంగా ఒక సాఫ్ట్‌వేర్‌తో ఉపాధి పనులను చేస్తున్నారు.
ఈ సాఫ్ట్‌వేర్ జాబ్ కార్డుల వివరాలు, గుర్తించిన పనులు, వాటి ప్రగతి, మస్టర్స్, పనుల డిమాండ్, డబ్బుల చెల్లింపు, తదితర వివరాలు అన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంటుంది.
తెలంగాణ రాష్టంలో ప్రత్యేకించి “రాగాస్” అనే సాఫ్ట్‌వేర్ ద్వారా ఉపాధి పనులను చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మెటీరియల్ కాంపోనెంట్ కింద కొన్ని పనులు చేపడుతున్నారని గమనించిన కేంద్రం ఆ సాఫ్ట్‌వేర్‌ను తొలగించి ఎన్‌ఐసీ పరిధిలోకి తీసుకు వచ్చింది.
ఈ నేపథ్యంలో జాబ్ కార్డులు పొందిన కూలీల ఆధార్ నంబర్లను కూడా జాబ్ కార్డుతో లింక్ చేయాలని నిర్ణయించింది.
జాబ్ కార్డుతో ఆధార్ నంబర్‌ను అనుసంధానం వల్ల కూలీలకు డబ్బులు చెల్లించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
జాబ్‌కార్డు పొందినప్పుడు కూలీలు ఇచ్చిన బ్యాంకు ఖాతాలను కొందరు సరిగా నిర్వహించని కారణంగా లావాదేవీలు నిలిచిపోయి బ్లాక్ అవుతున్నాయి.
కొందరు ఏదేని కారణాల వల్ల ఆ బ్యాంకు ఖాతాను రద్దు చేసుకుని మరొక బ్యాంకులో ఖాతా తీసుకున్న వాళ్లు
ఖాతా నంబర్‌ను ఉపాధి హామీ సిబ్బందికి ఇవ్వని కారణంగా కూలీ డబ్బు లు జమ కావడం లేదు.
అలాగే కొన్ని బ్యాంకులను మరొక బ్యాంకులో విలీనం చేసిన సమయంలో కూడా ఖాతాదారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సాంకేతిక కారణాల వల్ల ఉపాధి కూలీలకు డబ్బులు రాకుండా పోయాయి.
భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు రెండు మాసాల నుంచి దేశ వ్యాప్తంగా జాబ్ కార్డులకు కూలీల ఆధార్ నంబర్లను అనుసంధానం చేస్తున్నారు.
ఈ సమాచారం అంతా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు పంపిస్తున్నారు. కొత్త, పాత బ్యాంకు, పోస్టాఫీస్ ఖాతాలకు ఆధార్ నంబర్‌ను ఇదివరకే చాలా వరకు చేసుకున్నారు.
జాబ్ కార్డుకు ఆధార్ లింకు చేయడం వల్ల ఆటోమేటిక్ ఆ బ్యాంకు ఖాతా వివరాలు వస్తుంటాయి.
ఇప్పటి వరకు 92 శాతం మంది కూలీల ఆధార్ నంబర్లను జాబ్ కార్డులకు అనుసంధానం చేశారు.
ఇంకా ఎనిమిది శాతం మంది కూలీల ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేసుకోలేదని సిబ్బంది గుర్తించారు.
సదరు కూలీలు తమ బ్యాంకు ఖాతాలు, పోస్టాఫీస్ ఖాతాలకు ఆధార్ నంబర్ అనుసంధానం చేసుకున్నట్లయితే
ఆటోమేటిక్‌గా ఆ ఖాతాల్లో ఉపాధి హామీ పథకం కూలీ డబ్బులు జమ అవుతాయని డీఆర్‌డీఓ వి శ్రీధర్ తెలిపారు.
వంద శాతం జాబ్ కార్డులకు ఆధార్ నంబర్లను అనుసంధానం చేసి కూలీలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు.
ఆధార్ జాబ్ కార్డుకు అనుసంధానం